
మహా’ వర్షపాతం.. 4 రోజుల్లోనే నెల వాన! 40 రైళ్లు రద్దు, కొట్టుకుపోయిన హైవేలు
మహారాష్ట్రను రుతుపవన వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వానలు ముంచెత్తుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ముంబయి నగరం ఒక నెలకు సరిపడా వర్షపాతాన్ని నమోదు చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న ఈ అకాల భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలన్నింటినీ హై అలర్ట్ చేసినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం ప్రకటించారు. మంత్రాలయంలోని డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌లో విపత్తు నిర్వహణ శాఖ మంత్రి గిరీష్ మహాజన్, ఉన్నతాధికారులతో కలిసి సీఎం అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ముంబయి నగరంలో ఆదివారం ఏకంగా 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన అసాధారణ బలమైన ఈదురు గాలుల కారణంగా దాదాపు 300 చెట్లు కూలిపోయాయని సీఎం తెలిపారు. సోమవారం కూడా ఇదే స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉండటంతో, ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అన్ని కార్యాలయాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పనిచేసే విధానం) ప్రకటించినట్లు సీఎం స్పష్టం చేశారు. ముంబయి మెట్రో, బస్సులు సాధారణంగానే నడుస్తున్నప్పటికీ, లోకల్ రైల్వే నెట్‌వర్క్‌లో మాత్రం కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడింది.కొండచరియలు విరిగిపడి స్తంభించిన రవాణా వ్యవస్థ..భారీ వర్షాల కారణంగా ముంబయి-పూణే ఘాట్ సెక్షన్లో సోమవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు పాత హైవేపై కూడా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం ముంబయి-పూణే హైవేలో ముంబయి వైపు 3 లేన్లు, పూణే వైపు ఒక లేన్‌ను పునరుద్ధరించి తాత్కాలికంగా రవాణాను కొనసాగిస్తున్నారు. ముంబయి-గోవా రహదారిని సైతం పునరుద్ధరించే పనులు వేగంగా జరుగుతున్నాయి.రేపు క్లౌడ్‌బర్స్ట్, రెడ్ అలర్ట్ హెచ్చరికలు!జూలై 7 (మంగళవారం) నాసిక్, త్రింబకేశ్వర్ మధ్య తీవ్రమైన క్లౌడ్‌బర్స్ట్ (మేఘమథనం) సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.