
ఒక్క కుదుపు.. సెకన్లలో శవాల దిబ్బలు
ప్రకృతి కన్నెర్ర చేస్తే.. మనిషి నిర్మించిన ప్రపంచం క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. అప్పటివరకు జనజీవనంతో కళకళలాడిన నగరాలు భూమి ఒక్కసారి కంపించగానే శిథిలాల గుట్టలుగా మారిపోతాయి. కట్టుకున్న ఇళ్లు కూలిపోతాయి.. కుటుంబాలు చెల్లాచెదురవుతాయి.. ప్రాణాలతో బయటపడిన వారి కళ్ల ముందు తమ ఆత్మీయులను కోల్పోయిన విషాదం జీవితాంతం వెంటాడుతుంది.. భూకంపాలకు అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటైన లాటిన్ అమెరికా.. ఇలాంటి ఎన్నో ప్రకృతి విలయాలకు సాక్షిగా నిలిచింది. భూమి పొరల్లో చోటుచేసుకున్న కదలికలు కొన్ని సెకన్లలోనే నగరాల రూపురేఖలను మార్చేశాయి. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. తాజాగా కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం మరోసారి ఈ ప్రాంతంలోని పాత విషాదాలను ప్రపంచానికి గుర్తుచేసింది. ఈ ప్రకంపనల ధాటికి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైతీ.. ప్రపంచాన్ని కదిలించిన విషాదం లాటిన్ అమెరికా చరిత్రలో అత్యంత భయానక భూకంపాల్లో 2010లో హైతీలో సంభవించిన ప్రకంపనలు ఒకటి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0 మాత్రమే అయినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం ఊహించని స్థాయిలో కనిపించింది. రాజధాని పోర్ట్–ఔ–ప్రిన్స్ నగరం తీవ్రంగా దెబ్బతింది. వేలాది భవనాలు కూలిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాలు శిథిలాలుగా మారాయి. భూకంప నిరోధక ప్రమాణాలు లేని నిర్మాణాలు భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. ఈ విపత్తులో సుమారు 3.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక దేశం మొత్తం కోలుకోవడానికి ఏళ్లు పట్టింది. నిద్రలోనే మృత్యువు ఒడిలోకి వేలమంది.. 1868లో ఈక్వెడార్, కొలంబియా ప్రాంతాలను కుదిపేసిన భూకంపాలు మరో మహా విషాదాన్ని మిగిల్చాయి. **7.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు** అనేక పట్టణాలను నేలమట్టం చేశాయి. ప్రజలు గాఢనిద్రలో ఉన్న సమయంలో సంభవించిన ఈ భూకంపం.. క్షణాల్లో వేలాది ఇళ్లను శిథిలాలుగా మార్చింది. ఈక్వెడార్‌లో సుమారు 40 వేల


