
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని బాలాసోర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో, చాంద్‌బలి, దిఘాలకు చెరో 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు.ఈ వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో చాంద్‌బలి-దిఘా మధ్య బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది