
పాన్,ఆధార్ వాట్సాప్ లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులోబ్యాంకు ఖాతాలు గుల్ల
ఇది డిజిటల్ యుగం.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషం డిజిటల్ టెక్నాలజీతో ముడిపడి ఉంది. ఇక వాట్సాప్ వంటి మెసేంజర్లు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయడం, ఫొటోలు షేర్ చేసుకోవడం నుంచి మొదలుకొని.. ఆఫీస్ డాక్యుమెంట్లు పంపుకోవడం వరకు అన్నింటికీ వాట్సాపే మనకు ప్రధాన ఆధారం అయిపోయింది. అయితే, మీకొక షాకింగ్ నిజం చెప్పాలి. లోన్ అప్లై చేయాలన్నా, క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా, ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా, లేదా ఏదైనా హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలన్నా.. నేడు ‘కేవైసీ’ అనేది తప్పనిసరి. ఈ క్రమంలో అవతలి వ్యక్తులు, ఏజెంట్లు లేదా సంస్థలు అడిగిన వెంటనే మనం మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటి అత్యంత గోప్యమైన పత్రాలను క్షణం ఆలోచించకుండా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేస్తుంటాం. “ఫైల్ క్షణంలో అవతలి వాళ్లకు వెళ్లిపోతుంది కదా, పంపిస్తే తప్పేంటి?” అని మీరు తేలికగా తీసుకుంటున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడినట్లే. మీ ఒక్క వాట్సాప్ మెసేజ్ మీ జీవితాన్నే తలక్రిందులు చేయగలదు. భవిష్యత్తులో మీరు ఊహించని తీవ్రమైన ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం పొంచి ఉంది. చాలా మందికి ఒక భ్రమ ఉంటుంది. మనం వాట్సాప్‌లో ఒక డాక్యుమెంట్ పంపిస్తే, అవతలి వాళ్ళు చూసి డిలీట్ చేసేస్తారని అనుకుంటాం. కానీ అక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. మనం వాట్సాప్‌లో పంపిన డాక్యుమెంట్లు కేవలం ఆ అవతలి వ్యక్తి వాట్సాప్ చాట్‌లోనే ఉండిపోవు. అవతలి వ్యక్తి ఆ ఫైల్‌ను తన ఫోన్ గ్యాలరీలోకి, లాప్‌టాప్‌లోకి లేదా కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకుంటాడు. అంతేకాదు, ఆ ఫోన్‌కు సంబంధించిన క్లౌడ్ బ్యాకప్ ఆటోమేటిక్‌గా ఆన్ అయి ఉంటే, మీ పత్రాల కాపీలు ఆటోమేటిక్‌గా క్లౌడ్‌లో సేవ్ అయిపోతాయి. ఒకసారి డాక్యుమెంట్ మీ ఫోన్ దాటి బయటికి వెళ్తే, దానిపై మీ నియంత్రణ పూర్తిగా కోల్పోయినట్టే!