
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ హైక్స్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. టికెట్ రేట్స్ పెంపు ద్వారా వచ్చిన మొత్తాన్ని సినీ కార్మికుల సంక్షేమం కోసం వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది.‘అఖండ 2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘పెద్ది’ వంటి సినిమాలకు తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుకోడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలకు టికెట్ ధరల పెంపుతో వచ్చిన ఆదాయంలో 20 శాతం ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలని నిర్మాతలను ప్రభుత్వం కోరింది. ఆ మొత్తాన్ని ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్’, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అకౌంట్ లో జమ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆయా సినిమాల నిర్మాతలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఏసీ, నాన్ ఏసీ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. దాని ప్రకారం నాన్-ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70.. ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100 ఉంటుంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150.. ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200 ఉంటుందని పేర్కొంది.ఇక స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ రేట్లు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250.. ప్రీమియం రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300 ఉండేలా నిర్ణయించింది. మల్టీప్లెక్స్‌లలో రెగ్యులర్ టికెట్ల రేటు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250.. రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300గా ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలానే థియేటర్ల నిర్వహణ, అదనపు షోలు, భారీ బడ్జెట్ చిత్రాలు, ఫెస్టివల్ సీజన్స్ లో మీడియం బడ్జెట్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం జీవోలో ప్రస్తావించింది.ప్రతి థియేటర్లో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఐదు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక షోలో చిన్న సినిమా ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. పరిమిత బడ్జెట్‌తో తీసే చిన్న సినిమాలకూ పండుగల సమయంలో ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. రూ.100 కోట్లకుపైగా పెట్టుబడితో తీసే సినిమాలను సూపర్ హై బడ్జెట్ చిత్రాలుగా పేర్కొంది. వాటికి మొదటి 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అలానే సినీ కార్మిక సంక్షేమ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చే సినిమాలకే టికెట్ ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది.మల్టీప్లెక్స్‌లు సహా ప్రతి థియేటర్లో పేద, మధ్య తరగతి ప్రేక్షకుల కోసం 25 శాతం సీట్లు కేటాయించాలని ప్రభుత్వం జీవోలో తెలిపింది. అంటే 25 శాతం నాన్ ప్రీమియం సీట్లు ఉండాలి. అయితే ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ లో ఏసీ థియేటర్లకు రూ.5, నాన్-ఏసీ థియేటర్లకు రూ.3 నిర్వహణ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఎయిర్ కూల్డ్ థియేటర్లను రాబోయే రెండేళ్లలో ఏసీ థియేటర్లుగా మార్చుకోవాలని సూచించింది. 7.1 సౌండ్ సిస్టమ్, 2K/4K ప్రొజెక్షన్, కనీసం 75 అడుగుల స్క్రీన్ ఉండే సినిమా హాళ్లను స్పెషల్ థియేటర్లుగా గుర్తించనున్నట్లు తెలిపింది.





