కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి సంక్షోభ వాతావరణం నెలకొంది. ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ నిబంధనలపై థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతల మండలికి నడుమ వివాదం చెలరేగడంతో సెప్టెంబరు 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్లు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) మరియు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఉమ్మడిగా సంచలన ప్రకటన చేశాయి.
ఈ వివాదానికి ప్రధాన కారణం థియేటర్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్ల మధ్య ఉండాల్సిన కాలపరిమితి అని తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన ప్రతీ చిత్రం కనీసం 8 వారాల (రెండు నెలలు) వ్యవధి తర్వాతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కావాలని, ఈ మేరకు హామీ పత్రం ఇస్తేనే థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తామని తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్ల సమాఖ్య ఏకపక్షంగా కండిషన్ విధించాయి.
ఈ నిబంధనను తమిళ నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. పొరుగున ఉన్న తెలుగు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో లేని కొత్త నిబంధనలను కేవలం కోలీవుడ్‌లోనే రుద్దడం ఏమాత్రం తగదని స్పష్టం చేసింది. అన్ని వర్గాల భాగస్వాములతో చర్చించకుండా థియేటర్ యాజమాన్యాలు ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్మాతలు తేల్చిచెప్పారు.
థియేటర్ యజమానుల మొండి వైఖరికి నిరసనగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త సినిమాల విడుదలలతో పాటు, చిత్రాల షూటింగ్‌లు మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిగా నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. దీంతో కోలీవుడ్‌లో నిర్మాణాలు, విడుదలలు అన్నీ ఒకేసారి స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది.
గత కొద్దికాలంగా చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గుతోందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఓటీటీ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం సినిమాల నిర్మాణ వ్యయానికి కీలక ఆధారంగా మారిందని నిర్మాతలు భావిస్తుండటంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడింది.
ఈ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిందిగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాతల మండలి విజ్ఞప్తి చేయడానికి సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం లేదా ఇరు వర్గాల ప్రతినిధులు చర్చలు జరిపి ఒక సయోధ్యకు రాకపోతే, సెప్టెంబర్ నెలలో విడుదల కావలసిన పలు క్రేజీ తమిళ సినిమాలు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఈశ్వర్ సాయి భార్యపై మాధురి రాథోడ్ రివర్స్ కేసు.. లీగల్ వార్‌లో ఊహించని ట్విస్ట్!
రూమర్లకు చెక్.. చిరంజీవితో సినిమాపై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల.!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.




