
భారతదేశంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో బాలల భద్రతను బలోపేతం చేసే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. తన సోషల్ మీడియా వేదికల్లో వెలుగుచూసే బాలల లైంగిక వేధింపుల కేసులను నేరుగా భారతీయ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు నివేదించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం మెటా అంగీకరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో చిన్నారులకు రక్షణ కల్పించడంలో ఈ నిర్ణయం ఒక ప్రధాన అడుగు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పిల్లలకు హాని కలిగించే కంటెంట్‌ను ముందస్తుగానే గుర్తించి, తొలగించేలా ఇతర సోషల్ మీడియా సంస్థలతో కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. తగిన చర్యలు తీసుకోని ప్లాట్‌ఫారమ్‌లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటివరకు మెటా ఇటువంటి కేసులను అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్కు నివేదించేది. ఆ సంస్థ భారత ఏజెన్సీలతో కమ్యూనికేట్ చేసేది. అయితే ఈ ప్రక్రియ వల్ల విచారణ ఆలస్యం అవుతోందని, త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి స్థానిక పోలీసులకే నేరుగా రిపోర్ట్ చేయాలని భారత అధికారులు గట్టిగా పట్టుబట్టారు. సమగ్ర విచారణల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. జూలై 2026లో ఇన్‌స్టాగ్రామ్‌లో బాలల లైంగిక వేధింపుల మెటీరియల్‌కు సంబంధించిన పెయిడ్ ప్రకటనలు వచ్చాయనే నివేదికలపై కేంద్ర మంత్రిత్వ శాఖ మెటా ఎగ్జిక్యూటివ్‌లకు సమ్మన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ విచారణ ప్రారంభించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా పోక్సో చట్టం నిబంధనలను ప్లాట్‌ఫారమ్‌లు సరిగ్గా పాటిస్తున్నాయో లేదో పరిశీలించింది. ఆగస్టులో మెటా గ్లోబల్ అఫైర్స్ చీఫ్ జోయల్ కప్లాన్ భారత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ వేదికలపై అలాంటి కంటెంట్, డీప్‌ఫేక్‌లు రావడంపై సిఇఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపిన క్షమాపణలను కంపెనీ ప్రతినిధులు అధికారులకు అందించారు. ఆన్లైన్ బాలల భద్రత అనేది తమకు ప్రాథమిక సూత్రమని, దీనిపై ఎలాంటి రాజీ ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదే తరహా భద్రతా చర్యల కోసం ఇతర సోషల్ మీడియా కంపెనీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.