

- ఇస్రో ప్రైవేటీకరణపై బిగ్ ట్విస్ట్..
- చైర్మన్ నారాయణన్ సంచలన ప్రకటన
- ఉద్యోగుల ఆందోళనపై ఇస్రో చీఫ్ స్పందన
- సంస్థ భవిష్యత్తుపై కీలక హామీ
ISRO Privatisation : ఇస్రో ప్రైవేటీకరణ నిజంగా అవుతుందా? ఉద్యోగుల్లో ఇదే ఆందోళన.. ప్రస్తుత పరిణామాలతో ఇస్రోను ప్రైవైట్ పరం చేయబోతున్నారనే ఊహాగానాలతో ఉద్యోగుల్లో ఆందోళనలను రేకిత్తించింది. ఈ ప్రచారానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణ తెరదించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రైవేటీకరణపై ఆయన సంచలన ప్రకటన చేశారు.
అసలు ఇస్రోను ప్రైవేటీకరించే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. ఇకపై కూడా ప్రభుత్వ సంస్థగానే ఇస్రో కొనసాగుతుందని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. దేశ అంతరిక్ష పరిశోధన, అడ్వాన్స్ టెక్నాలజీ, వ్యూహాత్మక మిషన్లలో సంస్థ కీలక పాత్రను యధావిధిగా కొనసాగిస్తుందని అన్నారు. ఉద్యోగులు, తమ కుటుంబాల్లో నెలకొన్న ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమిదే :
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇస్రో భవిష్యత్ పాత్రపై ఉద్యోగ సంఘాల్లో తీవ్రచర్చ మొదలైంది. ప్రస్తుతం ఇస్రో ఆధ్వర్యంలో జరిగే రాకెట్లు, శాటిలైట్లు, ఇతర అంతరిక్ష వ్యవస్థల తయారీని ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపించాయి. దాంతో ఇస్రో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఇస్రో చైర్మన్‌ను కోరాయి.
ప్రైవేట్ రంగానికి అవకాశాలు వాస్తవమే :
ఈ నేపథ్యంలోనే చైర్మన్ నారాయణన్ కీలక వివరణ ఇచ్చారు. ఇస్రోలో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో ఎలాంటి ఆందోళనలు ఉన్నా పరిష్కరించేందుకు సంస్థ చర్యలు తప్పక తీసుకుంటుందని చెప్పారు. ప్రతి సమస్యకు విడివిడిగా రాతపూర్వక సమాధానం ఇవ్వడం సాధ్యం కాదని, ఉద్యోగుల సమస్యలను తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ప్రైవేట్ రంగానికి అవకాశాలు పెరగడం మాత్రం వాస్తవమేనన్నారు. ఇప్పటికే టెక్నికల్‌గా డెవలప్ అయిన రాకెట్లు, సాధారణ శాటిలైట్లు, ఇతర వ్యవస్థలను భారీ స్థాయిలో తయారు చేసే బాధ్యతను భవిష్యత్తులో పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే అవకాశం ఉందన్నారు. అంతమాత్రానా అది ఇస్రో ప్రైవేటీకరణగా భావించరాదని సంస్థ స్పష్టం చేసింది.
ఇస్రో వివరణ ప్రకారం.. :
పరిశ్రమలు ఇప్పటికే స్థిరపడిన టెక్నాలజీలను భారీగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇస్రో శాస్త్రీయ, సాంకేతిక వనరులను నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీల అభివృద్ధిపై కేంద్రీకరించనుంది. ముఖ్యంగా ఫ్రాంటియర్ రీసెర్చ్, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్, మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలు, చంద్రుడు-ఇతర గ్రహాల అన్వేషణ, వ్యూహాత్మక అంతరిక్ష సామర్థ్యాల అభివృద్ధిపై సంస్థ ఫోకస్ పెట్టనుంది.
భారత్ 2035 నాటికి దేశీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయడం, 2040 నాటికి భారతీయ వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడం వంటి లక్ష్యాలను పెట్టుకుంది. ఈ లక్ష్యాలను సాధించేందుకు ఇస్రోతో పాటు ప్రైవేట్ పరిశ్రమ సామర్థ్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందని అంతరిక్ష రంగ నిపుణులు అంటున్నారు.
ఏటా 50వరకు అంతర్జాతీయ ప్రయోగాలు :
దేశంలో ఏటా 50 వరకు అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే స్థాయికి చేరుకోవాలంటే ఒకే సంస్థపై ఆధారపడటం సాధ్యం కాదు అనేది ఇస్రో వాదన. అందుకే ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థల భాగస్వామ్యాన్ని పెంచాలని భావిస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న మార్పులను చూసి ఇస్రో ప్రైవేటీకరణగా భావించరాదని, భారత అంతరిక్ష రంగ విస్తరణగా చూడాలని సంస్థ చెబుతోంది. ఇస్రో భవిష్యత్తులోనూ ప్రభుత్వ సంస్థగానే కొనసాగుతుందని చైర్మన్ నారాయణన్ స్పష్టం చేయడంతో ఉద్యోగుల్లో నెలకొన్న అనుమానాలకు స్పష్టత వచ్చినట్లయింది.





