
IND vs SL : మహిళల ఆసియా కప్ 2026 టైటిల్ సమరంలో భాగంగా ఈరోజు (సెప్టెంబర్ 13న, ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. 2024 ఫైనల్లో తమ సొంతగడ్డపై (దంబుల్లా) భారత్‌కు షాక్ ఇచ్చి కప్పు ఎగరేసుకుపోయిన లంకకు ఈసారి దుబాయ్‌లో మైండ్ బ్లాకింగ్ రివెంజ్ ఇచ్చేందుకు హర్మన్‌ప్రీత్ సేన పక్కా వ్యూహంతో సిద్ధమైంది.
2024 పగ తీర్చుకోవాల్సిందే:
రెండు సంవత్సరాల క్రితం 2024 ఆసియా కప్ ఫైనల్లో చమరి అథపత్తు, హర్షిత సమరవిక్రమ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడి భారత్‌కు ఘోర పరాభవం మిగిల్చారు. ఆ దెబ్బకు బదులు తీర్చుకుని, ఎనిమిదోసారి ఆసియా కప్ 2026 ట్రోఫీని కైవసం చేసుకోవడమే టార్గెట్ గా టీమిండియా పక్కా స్కెచ్ వేసింది. ఈ టోర్నమెంట్లో ఇరు జట్లు ఓటమే ఎరుగకుండా అన్-బీటెన్‌గా ఫైనల్‌కు చేరడం విశేషం.
షఫాలీ, దీప్తి మాస్ ఫామ్:
ఈ టోర్నమెంట్‌లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ 168 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి లంక బౌలర్లకు దడ పుట్టిస్తోంది. మరోవైపు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 11 వికెట్లతో చెలరేగుతూ టోర్నీలోనే హైయెస్ట్ వికెట్ టేకర్‌గా శ్రీలంక కెప్టెన్ చమరి అథపత్తు సరసన నిలిచింది. వీరిద్దరి ఆల్‌రౌండ్ షోతో లంకను తొక్కిపడేయాలని భారత్ భావిస్తోంది.
వాతావరణం హాట్.. వర్షం జీరో:
ఫైనల్ మ్యాచ్‌కి వర్షం అడ్డు పడే అవకాశం ఉందని భయపడుతున్న ఫ్యాన్స్‌కు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దుబాయ్‌లో ఆదివారం వాతావరణం బాగా వేడిగా (103°F) ఉండనుందని, వర్షం పడే అవకాశం సున్నా శాతమని స్పష్టం చేసింది. దీంతో ఫుల్ మ్యాచ్ నాన్‌స్టాప్ డ్రామాతో కొనసాగడం ఖాయమైంది.
తప్పులు తగ్గించుకుంటే కప్పు మనదే:
ఏదో ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నిస్తేనే తప్పులు జరుగుతాయి. ఈ కీలకమైన మ్యాచ్‌లో తప్పులను తగ్గించుకుని మన బలాన్ని నమ్ముకుంటే విజయం మనదే అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పష్టం చేసింది. లంకను కట్టడి చేసి 2024 నాటి పరాభవానికి పగ తీర్చుకునేందుకు టీమిండియా వేట ప్రారంభించనుంది.
