
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 94 ఏళ్ల వయసులో ఇవాళ చెన్నైలో తుది శ్వాస విడిచారు. తొలి చిత్రాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న జానకి.. వివిధ భాషల్లో 400కి పైగా సినిమాల్లో నటించారు. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు. దిగ్గజ నటి ఇకలేరని తెలిసి సినీ ప్రముఖులు, సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.''ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. ‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి'' అని చిరంజీవి పోస్ట్ చేశారు.షావుకారు జానకితో తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమని నందమూరి బాలకృష్ణ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ''మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా ఎన్టీఆర్ బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కీలక పాత్ర పోషించారు''''పాండురంగ మహాత్మ్యం' నుంచీ ఎన్టీఆర్ బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడి వైపున జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత 'రామ్ - రహీమ్', 'వేములవాడ భీమకవి' చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది. మన దేశంలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటనా ప్రస్థానం చూసిన ఆర్టిస్ట్ షావుకారు జానకిగారు ఒక్కరే అనుకుంటాను. అంతటి సుదీర్ఘ నటనా జీవితంలో ఎన్నెన్నో మరపురాని పాత్రల్లో జనాన్ని మెప్పించారు. ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను'' అని బాలకృష్ణ అన్నారు. ''తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది. జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'' అని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.''శ్రీమతి షావుకారు జానకి గారు ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రముఖ నటి శ్రీమతి షావుకారు జానకి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి శ్రీమతి జానకి గారు.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారు. శ్రీమతి షావుకారు జానకి గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.''నలభై ఏళ్ల పాటు మేమిద్దరం ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశాం. నాకు తల్లిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. షావుకారు జానకి దక్షిణ భారత సినిమాకు ఒక గొప్ప నటి. ఆనాటి హీరోలందరితోనూ నటించారు. నా గురువు కె. బాలచందర్ గారికి అత్యంత ఇష్టమైన నటి. మాతృత్వానికి ప్రతిరూపమైన ఆమె కన్నుమూశారు. ఆమెకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నాను'' అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.





