
రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫామ్ రాపిడోను నిర్వహించే ఒప్పెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ₹10 లక్షల జరిమానా విధించింది. మిస్లీడింగ్ ప్రకటనలు, అన్యాయమైన వ్యాపార పద్ధతులు, అన్యాయ కాంట్రాక్ట్ నిబంధనలు మరియు డార్క్ ప్యాటర్న్స్ పాటించినందుకు గాను ఈ చర్యలు తీసుకుంది. రైడ్ కన్ఫర్మ్ కాకముందే వినియోగదారులను అదనపు డబ్బులు చెల్లించేలా ఒత్తిడి చేసే విధానంపై అథారిటీ సీరియస్ అయింది. CCPA చీఫ్ కమిషనర్ నిధి ఖరే, కమిషనర్ అనుపమ్ మిశ్రా ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాబ్ మరియు బైక్ టాక్సీ అగ్రిగేటర్లలో ప్రీ-రైడ్ టిప్పింగ్, డైనమిక్ ప్రైసింగ్ పద్ధతులపై జరుగుతున్న సెక్టార్-వైడ్ పరిశీలనలో భాగంగా ఈ ఆర్డర్ వెలువడింది. ప్రస్తుతం ఉబర్, ఓలా ప్లాట్‌ఫామ్‌లపై కూడా పరిశీలన కొనసాగుతోందని స్పష్టం చేశారు. రాపిడో యాప్ ప్రాథమికంగా ఒక ధరను చూపించి, వినియోగదారుడు బుకింగ్ చేసిన తర్వాత రైడ్ కన్ఫర్మ్ కాకముందే కొన్ని నోటిఫికేషన్లు పంపేదని CCPA గుర్తించింది. ఎక్కువ ధర చెల్లిస్తే రైడ్ లభించే అవకాశాలు పెరుగుతాయని, డ్రైవర్లు నిర్ణీత ధరకు రావడం లేదని పేర్కొంటూ అదనంగా రూ. 10, రూ. 20, రూ. 30 జోడించాలని ప్రాంప్ట్‌లు ఇచ్చేవారని పేర్కొంది. ఇప్పటికే అంగీకరించిన ఫేర్ కాకుండా మళ్లీ అదనంగా చెల్లిస్తేనే రైడ్ దొరుకుతుందనే తప్పుడు అభిప్రాయాన్ని ఇది కలిగిస్తుందని అథారిటీ వివరించింది. 2023 డార్క్ ప్యాటర్న్స్ గైడ్‌లైన్స్ ప్రకారం ఇది 'కన్ఫర్మ్ షేమింగ్' కిందకు వస్తుందని, వినియోగదారులపై ఒత్తిడి తేవడమేనని తేల్చిచెప్పింది. దీంతో పాటు యాప్‌లో 'సెట్ యువర్ ప్రైస్' స్లైడర్ వద్ద ఎక్కువ ధర వైపు గ్రీన్ టెక్స్ట్, తక్కువ ధర వైపు రెడ్ లేదా ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చే UI డిజైన్ ఉంచారని, ఇది 'ఇంటర్ఫేస్ ఇంటర్ఫరెన్స్' కిందకు వస్తుందని CCPA అభిప్రాయపడింది. వినియోగదారులను ఎక్కువ ధర ఎంచుకునేలా ఈ డిజైన్ పురికొల్పుతోందని పేర్కొంది. యాప్‌లో ప్రాథమికంగా చూపించే ఫేర్‌లో దూరం, సమయం, ట్రాఫిక్, టోల్స్ మరియు డ్రైవర్ వాటా కలిసి ఉంటాయని అథారిటీ స్పష్టం చేసింది. సర్వీస్ ప్రారంభం కాకముందే అదనపు మొత్తం కోరడానికి ఎలాంటి ఆధారం లేదని తెలిపింది. టిప్ అనేది సర్వీస్ పూర్తయిన తర్వాత స్వచ్ఛందంగా ఇచ్చేదని, మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025 ప్రకారం టిప్పింగ్ ఫీచర్ రైడ్ ముగిసిన తర్వాతే ఉండాలని స్పష్టం చేసింది. వివాదాస్పద ప్రాంప్ట్‌లు, వినియోగదారులపై ఒత్తిడి తెచ్చే UI డిజైన్‌ను వెంటనే నిలిపివేయాలని రాపిడోను ఆదేశించింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, డార్క్ ప్యాటర్న్స్ గైడ్‌లైన్స్ 2023, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ గైడ్‌లైన్స్ 2022 మరియు ఈ-కామర్స్ రూల్స్ 2020 నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలపై 15 రోజుల్లోగా కంప్లయన్స్ రిపోర్టు సమర్పించాలని అథారిటీ పేర్కొంది. రాపిడో 120 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించి ఉన్నందున, వినియోగదారులపై దీని ప్రభావం ప్రాతిపదికన ఈ ₹10 లక్షల జరిమానా విధించినట్లు స్పష్టం చేసింది.





