
ఎంతో ఇష్టపడి హీల్స్, శాండిల్స్, జూతీస్.. వంటివి కొంటుంటాం. అయితే వాటి స్ట్రాప్స్ వల్ల పాదాల చర్మం రాపిడికి గురై.. అక్కడి చర్మం ఎరుపెక్కడం, చిన్నపాటి గాయమవడం.. చాలామందికి అనుభవమే....
ఎంతో ఇష్టపడి హీల్స్, శాండిల్స్, జూతీస్.. వంటివి కొంటుంటాం. అయితే వాటి స్ట్రాప్స్ వల్ల పాదాల చర్మం రాపిడికి గురై.. అక్కడి చర్మం ఎరుపెక్కడం, చిన్నపాటి గాయమవడం.. చాలామందికి అనుభవమే. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..
ఇవి ప్రయత్నించండి! ⚛ కొత్త చెప్పులు వేసుకునే ముందే పాదాలకు కొద్దిగా పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె.. వంటివి రాసుకుంటే.. వాటి స్ట్రాప్స్ వల్ల చర్మం రాపిడికి గురి కాదు.. తద్వారా గాయాలవకుండా జాగ్రత్తపడచ్చు. ⚛ ప్రత్యేకమైన యాంటీ షూ బైట్ జెల్స్ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని చెప్పులు, షూస్ బిగుతుగా అనిపించిన చోట చర్మంపై అప్లై చేసుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ⚛ పొడిగా ఉన్న సబ్బును షూ స్ట్రాప్స్, పట్టీల లోపలి వైపు రుద్దాలి. ఇలా చేయడం వల్ల వాటిపై ఒక మృదువైన పొరలాగా ఏర్పడుతుంది. తద్వారా షూ వేసుకున్న తర్వాత చర్మంపై రాపిడి జరగకుండా జాగ్రత్తపడచ్చు. ⚛ సిలికాన్ జెల్ ప్యాడ్స్, హీల్ గ్రిప్స్, యాంటీ-ఫ్రిక్షన్ స్ట్రిప్స్.. వంటివి మార్కెట్లో దొరుకుతున్నాయి. షూ బిగుతుగా ఉన్న చోట వీటిని అమర్చుకోవడం, ధరించడం చేస్తే చెప్పులు కరవకుండా, సౌకర్యంగా ఉండచ్చు. ⚛ కొన్న కొత్తలో చెప్పులు బిగుతుగా ఉండడం వల్లే ఇలా పాదాలపై గాయాలవుతుంటాయి. కాబట్టి అవి కాస్త వదులుగా అయ్యేంత వరకు.. ముందుగా మందంగా ఉన్న సాక్సులు ధరించి, ఆపై చెప్పులు వేసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు. ⚛ కొన్ని చెప్పుల స్ట్రాప్స్, పట్టీలు బిగుతుగా, గరుకుగా ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిపై కొద్దిగా లెదర్ కండిషనర్, మాయిశ్చరైజర్.. వంటివి పూస్తే అవి త్వరగా మెత్తబడతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా చర్మంపై రాపిడి జరగకుండా, గాయాలు కాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. ⚛ చెప్పులు ధరించే ముందు కాళ్లకు టాల్కమ్ పౌడర్ రాసుకోవడం, చెప్పుల లోపల కూడా కొద్దిగా చల్లడం వల్ల.. చర్మానికి రాపిడి కలగకుండా ఉంటుందంటున్నారు నిపుణులు. ⚛ షూస్, శాండిల్స్ స్ట్రాప్స్ బిగుతుగా ఉండి కరుస్తాయనిపించిన చోట చర్మం పైన చిన్న బ్యాండ్ ఎయిడ్ అతికించుకోవడం వల్ల ఫలితం ఉంటుందట!
ఒకవేళ కరిస్తే..?! అయితే ఈ జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిసార్లు కొత్త చెప్పుల వల్ల చర్మంపై చిన్న చిన్న గాయాలవుతుంటాయి. దీనివల్ల మంట, నొప్పి ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటప్పుడు ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు. ⚛ ముందుగా గాయమైన చోట సబ్బు, చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి. పొడిగా తుడిచి కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేయాలి. ⚛ గాయమైన చోట ఐస్‌ప్యాక్ పెట్టినా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఓ ఐస్‌ముక్కను కాటన్ క్లాత్‌లో చుట్టి.. పది నిమిషాల పాటు ఆ ప్రదేశంలో అద్దుతూ ఉండాలి. ఫలితంగా ఆ భాగంలో నొప్పి, మంట తగ్గుతాయి. ⚛ కలబంద చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. కాబట్టి కలబంద గుజ్జును గాయంపై ఉంచినా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ⚛ మళ్లీ చెప్పులు వేసుకునే ముందు గాయమైన ప్రదేశాన్ని బ్యాండేజ్‌తో కవర్ చేయాలి. లేదంటే గాయం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లెదర్, కాన్వాస్ మెటీరియల్‌తో తయారుచేసిన చెప్పుల్ని ఎంచుకోవడం, మరీ బిగుతుగా లేకుండా చూసుకోవడం వల్ల సౌకర్యంగా ధరించచ్చంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.






