
Pakistan Families Cut Milk Meat And Wheat Amid Crippling Food Crisis 2026
Pakistan Food Crisis 2026 : పాకిస్థాన్లో రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దయనీయ ఆర్థిక పరిస్థితులు ఆ దేశ ప్రజల ఆహారంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో..
Pakistan Food Crisis 2026 : పాకిస్థాన్లో రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దయనీయ ఆర్థిక పరిస్థితులు ఆ దేశ ప్రజల ఆహారంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో.. సామాన్య కుటుంబాల బడ్జెట్ తలకిందులైంది. దీంతో మనుగడ సాగించేందుకు పౌరులు తమ ఆహార అలవాట్లను బలవంతంగా మార్చుకుంటున్నారు. కనీసం పాలు, మాంసం, గోధమలు వంటివి కూడా కొనుక్కొని తినే పరిస్థితి లేకుండా పోయింది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీఎస్) డేటాను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. గడిచిన ఆరేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన ఆహార పదార్థాల వినియోగం దారుణంగా పడిపోయింది.పాలు, మాంసం కోత.. పెరిగిన ఆహార అభద్రతగ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పాలు, మాంసం, గోధుమలు, బియ్యం, టీ పొడి వంటి ప్రాథమిక ఆహార పదార్థాల కొనుగోలును ప్రజలు గణనీయంగా తగ్గించేశారు. 2018-19 కాలంలో దేశంలో 15.92 శాతంగా ఉన్న ఆహార అభద్రత.. 2024-25 నాటికి ఏకంగా 24.35 శాతానికి చేరుకుంది. ఇదే సమయంలో తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య 2.37 శాతం నుంచి 5.04 శాతానికి పెరిగి రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పౌష్టికాహారం అందించే పాలు, మాంసం వంటి ఖరీదైన పదార్థాలను కొనే శక్తి లేక ప్రజలు సతమతమవుతున్నారు.వనస్పతి గీ వినియోగం 81 శాతం పెరుగుదలఅన్ని రకాల ఆహార పదార్థాల వినియోగం తగ్గుతుంటే.. ఒక్క వనస్పతి గీ వినియోగం మాత్రం ఊహించని రీతిలో పెరగడం గమనార్హం. నెలకు సగటున 690 గ్రాములుగా ఉన్న వనస్పతి గీ వినియోగం ఏకంగా 81 శాతం పెరిగి 1.25 కిలోగ్రాములకు చేరింది. ఖరీదైన మాంసకృత్తులు, ఇతర పోషకాహార పదార్థాలకు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో ఎక్కువ క్యాలరీలు అందించే వనస్పతి గీని ప్రజలు తమ రోజువారీ వంటకాల్లో అధికంగా ఉపయోగిస్తున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.పట్టణాల్లోనూ ఆకలి కేకలు.. అందని నిత్యావసరాలువ్యవసాయ ఆధారిత దేశంగా గుర్తింపు పొందిన పాకిస్థాన్.. 2021 నుంచి ఆహార పదార్థాల నికర దిగుమతిదారుగా మారింది. మార్కెట్లలో సరుకులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిని కొనుగోలు చేసే శక్తి లేక సామాన్యులు తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆహార అభద్రత సంక్షోభానికి గురయ్యారు. మార్కెట్లో ఆహారం లభించడం వేరు, దానిని కొనుగోలు చేసి పౌష్టికాహారం తీసుకోవడం వేరనే విషయాన్ని పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితి స్పష్టం చేస్తోంది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






