
శారీరక, మానసిక సమస్యలు కొంతమంది జీవితానికి సవాలు విసురుతుంటాయి.. తమ లక్ష్యాల్ని చేరుకోకుండా అడ్డుపడాలని చూస్తాయి. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని దాటుకొని మరీ తమను తాము నిరూపించుకుంటున్నారు కొందరు అమ్మాయిలు. హిమాన్షికా శర్మ ఇదే కోవకు చెందుతుంది....
శారీరక, మానసిక సమస్యలు కొంతమంది జీవితానికి సవాలు విసురుతుంటాయి.. తమ లక్ష్యాల్ని చేరుకోకుండా అడ్డుపడాలని చూస్తాయి. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని దాటుకొని మరీ తమను తాము నిరూపించుకుంటున్నారు కొందరు అమ్మాయిలు. హిమాన్షికా శర్మ ఇదే కోవకు చెందుతుంది. అరుదైన ఎముక సమస్య కారణంగా టీనేజ్లోనే చక్రాల కుర్చీకి పరిమితమైన ఆమె.. తన శారీరక స్థితిని చూసుకొని అధైర్యపడలేదు. తానెలా ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకుంది. ఈ పట్టుదలే నేడు ఆమెను ఫ్రీలాన్స్ రైటర్‌గా, కంటెంట్ స్ట్రాటజిస్ట్‌గా ఎదిగేలా చేసింది. ‘కోల్పోయిన వాటి గురించి బాధపడకుండా.. అందివచ్చిన అవకాశాల్ని అందుకున్నప్పుడే కెరీర్‌ని నిర్మించుకోగలం..’ అంటోన్న హిమాన్షిక సక్సెస్ స్టోరీ ఇది!
అవి చేదు జ్ఞాపకాలు! చండీగఢ్‌లో పుట్టి పెరిగింది హిమాన్షిక. ఎనిమిదేళ్ల వరకు అందరు పిల్లల్లా ఆరోగ్యంగా, ఆడుతూపాడుతూ పెరిగింది. అయితే ఈ సమయంలోనే ఆమె శరీరంలో మార్పులు మొదలయ్యాయి. కీళ్లు వంగిపోవడం, వంకరపోవడం గుర్తించింది. ఇదంతా ‘జువెనైల్ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్’ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి వల్లే అని వైద్యులు తేల్చారు. ‘నా చిన్నతనంలో నేను ఆనందంగా గడిపిన రోజులు నాకు గుర్తులేవు. తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరగడం, ఇంజెక్షన్లు, చికిత్సలు.. వీటితోనే నా బాల్యం గడిచిపోయింది. నన్ను తిరిగి మామూలు మనిషిని చేయాలని అమ్మానాన్నలు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ అది జరగలేదు. మోకాళ్లు, మణికట్టు, చేతి వేళ్లు, మెడ, నడుము.. ఇలా ఒక్కో శరీర భాగాన్నీ డ్యామేజ్ చేసిన ఈ వ్యాధి కారణంగా అందమైన స్కూల్ డేస్‌ని మిస్సయ్యా.. ఏళ్ల తరబడి నాలుగ్గోడలకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఓ రోజు మెట్లు దిగలేక ఏడుస్తుంటే నాన్నే నన్ను కిందికి మోసుకొచ్చిన సందర్భాన్ని నేను మర్చిపోలేను. ఆ రోజు ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. ఇలా క్రమంగా నా ఆరోగ్యం క్షీణించడంతో కొన్నేళ్లకు చక్రాల కుర్చీకే పరిమితమవ్వాల్సి వచ్చింది..’ అంటూ తన ఆరోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చింది హిమాన్షిక.
17 ఏట.. ఆ కల నెరవేరింది! తనకున్న ఎముక వ్యాధి నుంచి బయటపడేందుకు పలు చికిత్సలు, ఆపరేషన్లు చేయించుకున్న హిమాన్షిక.. ఇది సాధ్యం కాకపోవడంతో ఒకానొక సమయంలో ఈ ప్రయత్నాలన్నీ విరమించుకొని తన కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంది. ‘రోజులు గడుస్తున్న కొద్దీ ఈ వ్యాధి నా శరీరమంతా విస్తరించి నా జీవితాన్ని ప్రశ్నార్థకం చేయాలనుకుంది. కానీ నేను దానికి ఆ అవకాశం ఇవ్వకూడదనుకున్నా. అందుకే నా చదువు, కెరీర్‌పై దృష్టి పెట్టా. ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశాక నాకు ఇష్టమైన కంటెంట్ రైటింగ్ వైపు మళ్లా. ఎప్పటికైనా పుస్తకం రాయాలని కలలు కన్నా. ఈ క్రమంలోనే మా అమ్మానాన్నల ప్రోత్సాహంతో 17 ఏట ‘లవ్ బియాండ్ వర్డ్స్’ అనే పుస్తకం రాసి ఆ కల నెరవేర్చుకున్నా. అయితే ఆ బుక్కి అంత ఆదరణ రాకపోయినా.. ఎంతోమంది రచయితలు నాకు పరిచయమయ్యారు. ఎముక వ్యాధి కారణంగా ఒకానొక దశలో భవిష్యత్తే లేదనుకున్న నేను వాళ్ల స్ఫూర్తి కథలు తెలుసుకొని ప్రేరణ పొందా. ఫ్రీలాన్స్ రైటర్‌గా వరుస అవకాశాలు అందుకున్నా..’ అంటోన్న హిమాన్షిక ప్రస్తుతం ఓవైపు కంటెంట్ రాస్తూనే.. మరోవైపు పలు దేశ, విదేశీ సంస్థలకు కంటెంట్ స్ట్రాటజిస్ట్‌గా, బ్రాండ్ వాయిస్ ఎక్స్‌పర్ట్‌గా సేవలందిస్తోంది. తద్వారా మార్కెట్లో వాటి విలువను పెంచుతోంది.
‘సైకిల్ కూడా తొక్కలేవ’న్నారు! ఇలా తన శారీరక సమస్యను అధిగమించి.. తనకిష్టమైన రంగంలో కెరీర్‌ను నిర్మించుకున్న హిమాన్షిక.. తాను జీవితంలో స్థిరపడడమే కాదు.. తన సంపాదనతో కుటుంబానికీ అండగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే తన చెల్లి చదువుకయ్యే ఖర్చును భరించడంతో పాటు తన తండ్రితోనూ ఓ రెస్టరెంట్ వ్యాపారం ప్రారంభించేలా చేసింది. ‘మాది మధ్య తరగతి కుటుంబం కావడం, ఎదిగే క్రమంలో నా చికిత్సలకు ఎక్కువ డబ్బు ఖర్చవడంతో ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే నేను కెరీర్లో స్థిరపడ్డాక ఈ సమస్యలన్నింటికీ సమాధానం దొరికినట్లయింది. ఈ క్రమంలోనే చెల్లిని పైచదువులు చదివిస్తున్నా.. అలాగే ఓ రెస్టరంట్ వ్యాపారం ప్రారంభించడానికి నాన్నకి ఆర్థికంగా సహకరించా. ఈ మధ్యే సొంతంగా ఓ కారు కూడా కొన్నా. మొన్నటిదాకా బయటికి వెళ్లాలంటే మరొకరిపై ఆధారపడాల్సి వచ్చేది.. నా దుస్థితి చూసి కొంతమంది ‘ఇక నువ్వు కనీసం సైకిల్ కూడా తొక్కలేవు..’ అంటూ ఎగతాళి చేశారు. అలాంటిది ఇప్పుడు ఇలా ఎవరి పైనా ఆధారపడకుండా సొంతంగా కెరీర్లో ముందుకు సాగడం సంతోషంగా, గర్వంగా అనిపిస్తోంది. ఎవరైనా సరే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. పరిస్థితులు మనకు అనుకూలంగా మారే వరకు వేచి చూడడం, కోల్పోయిన వాటి గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఫలితం ఉండదు. మనకు అందుబాటులో ఉన్న అవకాశాల్ని అందుకుంటూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడమే సిసలైన కెరీర్ విజయం..’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోందీ యువ రైటర్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.
Found this helpful?
Share this story with your network










