
Gold Price Fall : గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనమవుతున్నాయి. బులియన్ మార్కెట్లో వరుసగా 4 రోజుల్లో తులం బంగారం (24 క్యారెట్లు) ధర ఏకంగా రూ.9110 మేర పడిపోయింది. ఆగస్టు 29వ తేదీన దాదాపు రూ.3 వేలు దిగొచ్చిన బంగారం ధర ఆ తర్వాత వరుస సెషన్లలో భారీగా పడిపోతూ వస్తోంది. దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న తరుణంలో బంగారం ధరలు ఇలా భారీగా తగ్గుతుండడం కొనుగోలుదారులకు ఊరటగా చెప్పవచ్చు. వెండి రేటు రూ.10 వేలు తగ్గి రూ.2.50 లక్షల స్థాయికి మళ్లీ దిగివచ్చింది. అయితే, బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు గల కారణాలేంటి? ఇంకా తగ్గుతాయా? బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నేటి బంగారం ధరలు ఇలాదేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఒక్కరోజే రూ.2070 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో తులం బంగారం ధర రూ.1,52,020 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు ఈరోజు రూ.1900 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,39,350 వద్దకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర రూ.10 వేలు తగ్గడంతో రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది.ఆ ఒక్క కారణంతోనే భారీ పతనంఇరాన్పై అమెరికా భీకర దాడులు చేపడుతుండడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో మార్కెట్లు ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక వైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతోంది. దీంతో పసిడి ధరలు భారీగా దిగివస్తున్నాయి. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ, పశ్చిమాసియా యుద్ధం విషయంలో క్రూడ్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషించడంతో రివర్స్ జరుగుతోంది. బంగారం, వెండి వండి విలువైన ఖనిజాల ధరలు భారీగా పడిపోతున్నాయి.అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత విషయంలో వేచి చూసే ధోరణని అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ నిధులను ఉపసంహరించుకుని, డాలర్లు, యూఎస్ బాండ్లలోకి మళ్లిస్తున్నారు. అలాగే గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్స్ సైతం ధరలు దిగిరావడానికి కారణమవుతున్నట్లు బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.పసిడి ధరలు ఇంకా తగ్గుతాయా?పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో చమురు ధరలు మరింత పెరిగి బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపించవచ్చని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాడులు కొనసాగితే బంగారం ధరలు ఇంకా తగ్గవచ్చని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రికవరీ వచ్చే వరకు రాబోయే కొద్ది రోజులు బంగారం ధరలు మరింత ఒడుదొడుకులకు గురై దిగివచ్చే అవకాశం ఉందంటున్నారు. వివాహాలు లేదా పండుగల అవసరాల కోసం బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి సమయమని, ధరలు తగ్గినప్పుడు విడతల వారీగా కొనుగోలు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.
Found this helpful?
Share this story with your network










