
90ల కాలంలో పుట్టి పెరిగిన వారికి 'ఆశ చాక్లెట్' (Asha Chocolates) అంటే తెలియనివారు ఉండరు. స్కూల్ బెల్ మోగగానే జేబులో ఉన్న 25 పైసలు, 50 పైసలు లేదా రూపాయి నాణేన్ని పట్టుకుని కొట్టు దగ్గరకు పరుగెత్తి, ఆశ చాక్లెట్ కొనుక్కొని తినడంలో ఉన్న ఆనందమే వేరు. ప్రతి ఒక్కరి చిన్ననాటి తీపి జ్ఞాపకాలలో ఈ చాక్లెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఐకానిక్ చాక్లెట్ కాలక్రమేణా మార్కెట్ నుంచి ఎందుకు కనుమరుగైంది? దీని వెనుక ఉన్న కారణాలను ప్రముఖ యూట్యూబర్ విఆర్ రాజా (V R Raja) గతంలో తన వీడియో ద్వారా వివరించారు.
ఆశ చాక్లెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన ప్రముఖ 'నూట్రిన్ కాన్ఫెక్షనరీ' (Nutrine Confectionery) సంస్థ తయారు చేసింది. ఈ సంస్థను 1952లో బి. వెంకటరామరెడ్డి గారు స్థాపించగా, ఆ తర్వాత ఆయన కుమారుడు ద్వారకానాథ్ రెడ్డి దీనిని భారతీయ మార్కెట్లో అగ్రగామి బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. అ కంపెనీ చిత్తూరు జిల్లాలో స్టార్ట్ అయ్యింది. మన దేశంలోనే కాదు దాదాపు 10 దేశాల్లో ఆశా చక్లెట్ ఎగుమతులు, విక్రయాలు జరిగాయి.
ఆశా బ్రాండ్ కింద ప్రధానంగా 'ఆశ స్వీట్ మేజిక్' (Asha Sweet Magic) చాక్లెట్లు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇవి మాత్రమే కాకుండా నూట్రిన్ సంస్థ ఆశ ఫ్లేవర్‌తో పాటు మహాలాక్టో (Maha Lacto), కొకోనట్, పైన్ఆపిల్, కాఫీ, మ్యాంగో బార్ వంటి అనేక రకాల మిఠాయిలు, టాఫీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఆశ చాక్లెట్ సాధించిన అపారమైన విజయంలో దాని 'ధర' అతి ముఖ్యమైన పాత్ర పోషించింది. 25 పైసలు, 50 పైసలు ఆతర్వాత కాలంలో రూపాయి ధరల్లో లభించడం వల్ల సామాన్య కుటుంబాల పిల్లలకు ఇది ఎంతో అందుబాటులో ఉండేది. అయితే కాలక్రమేణా చాక్లెట్ తయారీకి కావలసిన ప్రధాన ముడిసరుకులైన కోకో (Cocoa), పాలు, చక్కెర, ప్యాకింగ్ కవర్ల ధరలు భారీగా పెరిగాయి. రూపాయి కంటే ధర పెంచితే పిల్లలు కొనుగోలు చేయకపోవచ్చనే భయం, ఒకవేళ రూపాయికే అమ్మితే భారీ నష్టాలు రావడం వల్ల కంపెనీ ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది.
భారతీయ మార్కెట్లో అప్పటి వరకూ తక్కువ ధరకు లభించే చాక్లెట్స్ కే ఎక్కువ సేల్స్ ఉండేవి. అది గమనించిన విదేశీ సంస్థలు ఇక్కడి చాక్లెట్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారన్ని చిన్నగా విస్తరించారు. కాడ్బరీ (Cadbury), నెస్లే (Nestle), పర్ఫెట్టి వాన్ మెల్లే (Perfetti Van Melle - ఆల్పెన్లీబే, సెంటర్ ఫ్రెష్) వంటి అంతర్జాతీయ బహుళ జాతీయ (MNC) కంపెనీలు భారీ స్థాయిలో ప్రవేశించాయి. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లు, రకరకాల ఫ్లేవర్లు, టీవీలలో నిరంతరం భారీ ప్రకటనలు (Advertisements) గుప్పించి పిల్లల దృష్టిని తమవైపు తిప్పుకున్నాయి. ఈ స్థాయిలో అడ్వర్టైజింగ్ బడ్జెట్ కేటాయించడం స్థానిక సంస్థలకు సాధ్యపడలేదు.
కాలక్రమేణా పెరిగిన పోటీ దృష్ట్యా, 2006లో నూట్రిన్ కంపెనీ తన వ్యాపారాన్ని ప్రముఖ 'గోద్రేజ్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్' (Godrej Foods and Beverages) సంస్థకు సుమారు రూ. 260 కోట్లకు విలీనం (అమ్మకం) చేసింది. ఆ తర్వాత గోద్రేజ్ సంస్థ కూడా మెయింటేన్ చేయలేక.. కొన్నాళ్లకు అమెరికాకు చెందిన ప్రముఖ 'హెర్షేస్' (Hershey's) సంస్థతో కలిసి 'గోద్రేజ్ హెర్షేస్'గా వ్యాపారం సాగించింది. గోద్రేజ్ విలీనం తర్వాత కూడా తీవ్రమైన మార్కెట్ పోటీ వల్ల 2008-2010 కాలం నాటికి ఆశ చాక్లెట్ల ఉత్పత్తి దాదాపు పూర్తిగా నిలిచిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
కాలానుగుణంగా వ్యాపార సమీకరణలు మారి ఆశా చాక్లెట్స్ మార్కెట్ నుండి నిష్క్రమించినప్పటికీ, 90స్ కిడ్స్ హృదయాలలో అది అందించిన తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి.





